భూపాలపల్లి డీఆర్డీఓ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..
ఇద్దరు అధికారుల అరెస్ట్..
రూ.39.14 లక్షలు కాంట్రాక్టర్ల నుంచి బదిలీ
బిల్లుల చెల్లింపులకు పర్సంటేజీలు..
ఫోన్లలో బయటపడ్డ బాగోతం..
వివరాలు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య..
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి..
జయశంకర్ భూపాలపల్లి ప్రతినిధి, అక్టోబర్ 22 అక్షయ న్యూస్:
భూగర్భ జలాలను పెంపొందించి, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను అభివృద్ధి చేయాల్సిన వాటర్‌షెడ్ ప్రాజెక్టులో అవినీతి బాగోతం వెలుగుచూసింది. ప్రజా ప్రయోజనాల కోసం చేపట్టాల్సిన పనుల్లో పర్సంటేజీల పేరుతో వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వ్యవహారం ఏసీబీ తనిఖీలతో బట్టబయలైంది. కాంట్రాక్టర్ల నుంచి ఏకంగా రూ.39.14 లక్షలు వివిధ ఖాతాలకు బదిలీ అయినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించారు. బిల్లుల చెల్లింపుల సమయంలో డబ్బులు బదిలీ చేయాలంటూ సందేశాలు పంపినట్లు ఆధారాలు సేకరించామని తెలిపారు. ఈ వ్యవహారంలో వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి, టెక్నికల్ అధికారి రాజును అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) కార్యాలయంలో రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత ఫోన్లలోని సమాచారాన్ని తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
పర్సంటేజీల పేరుతో వేధింపులు..
ప్రభుత్వ అభివృద్ధి పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సిన అధికారులు.. అదే బిల్లుల పేరుతో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. పనులు పూర్తి చేసినా బిల్లుల చెల్లింపుల విషయంలో పర్సంటేజీల కోసం ఒత్తిడి తెచ్చినట్లు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చినప్పటికీ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదనే ఆరోపణలు కూడా తెరపైకి వచ్చాయి. రేగొండ మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. డీఆర్డీఓ కార్యాలయంలో తనిఖీలు చేపట్టి, సంబంధిత రికార్డులు, ఫోన్ సమాచారాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో నగదు బదిలీలకు సంబంధించిన వివరాలు సేకరించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
- ఫోన్ సందేశాలే కీలక ఆధారాలు..
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల సమయంలో నగదు బదిలీ చేయాలంటూ ప్రాజెక్టు అధికారి సతీష్‌రెడ్డి, టెక్నికల్ అధికారి రాజు సందేశాలు పంపినట్లు దర్యాప్తులో గుర్తించామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆ సందేశాల్లో పేర్కొన్న ఖాతాలకు కాంట్రాక్టర్ల నుంచి సుమారు రూ.39,14,000 బదిలీ అయినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఈ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, రికార్డులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పనుల బిల్లుల చెల్లింపుల వ్యవహారంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు వెల్లడికావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
- మూడు మండలాల్లో వాటర్‌షెడ్ పనులు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా రేగొండ, మల్హర్రావు, పలిమెల మండలాలను వాటర్‌షెడ్ ప్రాజెక్టు అమలుకు ఎంపిక చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, భూగర్భ జలాలను పెంపొందించడం కోసం గుంతలు తవ్వడం, ఊటగుంటలు నిర్మించడం వంటి పనులు చేపడుతున్నారు. రేగొండ మండలంలోని భాగిర్తిపేట, గూడెపల్లి, మడతపల్లి, నారాయణపూర్, దుంపిళ్లపల్లి, పొనగండ్ల గ్రామాల్లో ఈ పనులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ పనులను నలుగురు కాంట్రాక్టర్లు చేపడుతున్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపులు, నగదు బదిలీల వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది.
- లంచం అడిగితే 1064కు ఫిర్యాదు చేయండి..
ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయడానికి లేదా బిల్లులు మంజూరు చేయడానికి ఎవరైనా అధికారులు, ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే సహించేది లేదని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. బాధితులు భయపడకుండా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అవినీతికి పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలా ఉండగావాటర్షెడ్ ప్రాజెక్టులో వెలుగుచూసిన ఈ వ్యవహారం ప్రభుత్వ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రజాధనంతో చేపట్టే పనుల్లో అవినీతి అధికారులు మామూళ్ల కోసం పీడించడం మరోసారి బట్టబయలైంది. వరుస ఘటనలతో అవినీతి అధికారుల్లో వణుకు మొదలైంది. కొద్ది నెలల క్రితం కోర్టు సిబ్బంది, కలెక్టరేట్ లోని మైనింగ్ అధికారి అవినీతి బాగోతాలపై ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రాజెక్టు అధికారి ఆఫీసులో ఇద్దరు అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.